ARUNACHALESWARA

అరుణాచలం దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగా క్షేత్రాలలో అగ్ని భూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణ పాపాలను తొలగించునది అని అర్థం అని పండితులు చెబుతారు. అదే తమిళంలో అయితే ‘‘తిరువన్నామలై’’ అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. అరుణాచలం క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం, ఎర్రని ఎండలో.. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. చలికి గజ గజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి పద్రక్షిణం చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్య లోక వాసులు కూడా తిరువాన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.